దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మానుకోట అంటేనే విప్లవాల గడ్డ.. చైతన్యానికి అడ్డా.. ఆ చైతన్యంతో రెడ్ల గడీలలు మాయమైపోయాయి. కానీ, మానుకోట (Manukota) నియోజకవర్గంపై రెడ్డి సామాజికవర్గ నాయకుల పట్టు మాత్రం కోల్పోకుండా సజీవంగానే దశాబ్దాలపాటు కొనసాగుతూ వస్తోంది. మహబూబాబాద్ (Mahabubabad) నియోజకవర్గం (Constituency) దశాబ్దాల పాటు జానారెడ్డి జనార్దన్ రెడ్డి (Jannareddy Janardan Reddy) ఎమ్మెల్యేగా ఏలికలో ఉంటూ వచ్చింది. ఆనాటి కాలంలో ఎమ్మెల్యేను కలవాలన్నా.. ఎమ్మెల్యేతో మాట్లాడాలన్నా.. గ్రామాలలో, పట్టణంలో ఉన్న మరో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుడిని ప్రసన్నం చేసుకోవాల్సి వచ్చేది. ఎమ్మెల్యేను చూడాలంటే అదేదో అద్భుతాన్ని చూసినట్టు భావించాల్సిందే. అలాంటి మానుకోట నియోజకవర్గంలో కమ్యూనిస్టులు (Communist) విప్లవ జెండాను ఎగురవేసి బిసి నేత బండి పుల్లయ్యను ఎమ్మెల్యేను చేశారు. అయినప్పటికీ, ఎమ్మెల్యే ఏ సామాజికవర్గానికి, ఏ పార్టీకి చెందినవాడైనా రెడ్డి నాయకుల కనుసన్నల్లోనే ఏలికలు జరిగాయి. ఇక తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచినా ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య (Sriram Bhadraiah) మాత్రం కొంత మేర స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసి రెడ్లను ప్రక్కన పెట్టడం జరిగింది. ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తెదేపా నేత వేం నరేందర్ రెడ్డి (Vem Narendar Reddy) స్వయంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడంతో నియోజకవర్గంలో రెడ్ల పట్టు మళ్ళీ కొనసాగింది. అనంతరం ఎస్టీ రిజర్వేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా నిలిచి గెలుపొందిన ప్రస్తుత భారాస ఎంపీ మాలోత్ కవిత (Maloth Kavitha) సైతం మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, భరత్ చంద్ రెడ్డిల కనుసన్నల్లోనే పాలన సాగించింది. అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అంటే భరత్ చంద్ రెడ్డి (Bharathchand Reddy) అనే బ్రాండ్ మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మాలోత్ కవితకు మరోదారి లేక అఇష్టంగానే రెడ్డి సామాజికవర్గ నేతలకు దన్నుగా నిలవాసివచ్చిందేమో.. ఇందుకు ఇదర్శనంగా మాలోత్ కవిత పలు వేదికల్లో రెడ్డి నేతలపై, గడీల వ్యవస్థపై పొడిపొడి విమర్శలు, ఛలోక్తులు విసరడం గమనించవచ్చు. ఏ కులం ఎమ్మెల్యే అయినా.. ఆ ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవాడైనా మహబూబాబాద్ నియోజకవర్గ పాల మాత్రం దశాబ్దాలుగా రెడ్డి సామాజికవర్గ నేతల కనుసన్నలలోనే కొనసాగుతూ వచ్చింది. రెడ్డి నేతలు ఏ వ్యక్తికి అనుకూలంగా పైరవీ చేస్తే.. ఎమ్మెల్యేగా ఉన్నవారు ఆ వ్యక్తికే తాయిలాలు (ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇతర లబ్ది) అందించేవారు. కాదంటే మొహం చాటేసేవారు.
Also Read : నాయకుల స్థానాలకు.. నాయకురాళ్లు ఎసరు..!? @DhivitiNews.com
అయితే, ఇదంతా గతం మాత్రమే.. గత రెండు దఫాలుగా భారాస తరుపున నిలిచి గెలిచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ (Banoth Shankar Naik) పాలన మాత్రం తనదైన ముద్రతో భిన్నంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యేను తమకు అనుకూలంగా మార్చుకొని, తాము చెప్పినట్లు పాలన సాగించాలని ప్రయత్నించే కొందరు రెడ్డి సామాజికవర్గ నేతలను క్రమక్రమంగా దూరంగా ఉంచుతూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యుడికి చేరువయ్యారు శంకర్ నాయక్. నియోజకవర్గంలో ఏ రెడ్డి నేత చేత బాధింపబడ్డ ఏ వ్యక్తి అయినా గతంలో ఎమ్మెల్యేను కలిసి తన గోడును వెళ్లబుచ్చుకోవాలంటే కనీసం అప్పోయింట్మెంట్ సైతం గగనంగానే దొరికేదని గత పరిస్థితులను నెమరువేసుకుంటోంది ఆనాటి ప్రజానీకం. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఒక బాధితుడు ఏ సామాజికవర్గ వ్యక్తి మూలంగా బాధించబడినప్పటికీ ఆ వ్యక్తి తన గోడును ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాలంటే ఆ బాధితునికి, ఎమ్మెల్యేకి మధ్యలో ఎలాంటి చోటామోటా నేతల పైరవీ అక్కరలేదని నిరూపిస్తూ నియోజకవర్గంలోని ఏ మారుమూల ప్రాంతాలకు చెందిన వ్యక్తి అయినా తనను నేరుగా కలిసేలా.. ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ పేరు సంపాదించుకున్నారు. ఆయనపై ఎన్ని వివాదాస్పద ఆరోపణలు వచ్చినప్పటికీ, మానుకోట నియోజకవర్గంలో రెడ్ల ప్రాబల్యాన్ని తగ్గించిన ఎమ్మెల్యేగా ఆయనను గుర్తించడంలో పార్టీలకతీతంగా అందరూ ఏకీభవిస్తారనడంలో సందేహమే లేదు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మళ్ళీ టికెట్ వస్తుందా..? రాదా..? అనే సందేహాలు నియోజకవర్గంలో ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తమ ప్రాబల్యాన్ని తగ్గించిన శంకర్ నాయక్ కు టికెట్ లభించే అవకాశాలకు గండి కొట్టేలా నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గ నేతలు పార్టీలకతీతంగా భారాస అధిష్టానం వద్ద విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తికి మాత్రమే టికెట్ లభించేలా, శంకర్ నాయక్ కు ఎమ్మెల్యే టికెట్ లభించకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులే స్వయంగా లీకులిస్తున్నారు. ఒకవేళ శంకర్ నాయక్ కు ఈసారి సైతం పార్టీ టికెట్ లభిస్తే.. తెరవెనుక పార్టీలకతీతంగా ఏకమై ఆయన ఓటమి కోసం పని చేయాలని రెడ్డి సామాజికవర్గ నాయకులు ధృడ సంకల్పంతో ఉన్నారని వినికిడి. మరి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈసారి మానుకోట నియోజకవర్గం లోని రెడ్డి నేతల వ్యూహాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
Admin
Dhiviti News