దివిటీ న్యూస్ - ఎడిటోరియల్ / : తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బాగుపడేలా లేదనే సంకేతాలు ఆ పార్టీ నాయకులే స్వయంగా ఇస్తున్నారు. ముందు మురిసినోడు పండుగ కానడు అని తెలంగాణాలో సామెత గుర్తుకు వస్తోంది కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తుంటే. రేవంత్ రెడ్డి టిపిసిసి పగ్గాలు చేపట్టినాక, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణాలో కాంగ్రెస్ కు కాస్తో కూస్తో ఊపు వస్తున్న నేపథ్యం, సీఎం నేనంటే నేనే.. కాదు ఆవిడ, కాదు అతను అంటూ అసలు కథ (ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించేది) మరిచి ఎప్పుడో పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినట్టే ఇప్పుడు లెక్కలు కడుతూ పాత పంథానే అనుసరిస్తూ తాను సీఎం అంటే తానే సీఎం అని వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో తమ డొల్ల తనాన్ని బహిర్గతం చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.
Also Read : రెడ్ల ‘కోట’లో ‘శంకరు’ని పాగా..!! @DhivitiNews.com
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అభ్యర్థినని గతంలో జానారెడ్డి ప్రకటించగా, మల్లు భట్టివిక్రమార్క సైతం తాను రేసులో ఉన్నట్టు ప్రకటించడం, ఈమధ్యనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజన అభ్యర్థి సీతక్కను సీఎంగా ప్రకటించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేయడం, అలాగే గిరిజన అభ్యర్థి అనగానే నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన సీతక్కను ఎందుకు సీఎంను చేస్తాం.. ఎప్పటినుండో పార్టీలో ఉన్న బెల్లయ్యను మాత్రమే గిరిజన సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని మరో కాంగ్రెస్ నేత ప్రకటించడం, రేవంత్ కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేయడం. ఇదంతా పాత ఐఖ్యత లేని కాంగ్రెస్ ను ఎన్నికల ముందే ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు ప్రస్తుత కాంగ్రెస్ నేతలు. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా టి కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ప్రత్యక్ష విమర్శలకు దిగడంతో కాంగ్రెస్ పై కాస్తో కూస్తో సానుకూల అభిప్రాయాలతో ఉన్న ఓటర్లు మీమాంశలో పడుతున్నారు. ఇక వీళ్లు మారరా? అని ప్రజలు ఈసడించుకుంటున్నారు. మొన్నటి దాకా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై సీనియర్ల లొల్లి.. ఇప్పుడేమో కౌన్ బనేగా సీఎం పదవి అంటూ తెగని పంచాయితీ.. ‘సీఎం సీటుపై అప్పుడే కుస్తీ ఎందుకు? పార్టీనే గాడిలో పెట్టుకోవడం చేతగాని, వీళ్లకా రాష్ట్రంలో అధికారం కట్టబెట్టేది?’ అని ప్రజలు ఆసహ్యించుకుంటున్నారు. తమకు ఓటేస్తే పదవులకోసం కొట్టుకు చస్తాం అని ప్రజలకు సూచన ప్రాయంగా తెలుపుతున్నట్టే ఉంది టి కాంగ్రెస్ నాయకుల తీరు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, కాంగ్రెస్ నాయకుల దిగజారుడు వ్యాఖ్యలు, అనైక్యత రాగాల మూలంగా కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను వారంతట వారే మరోసారి ప్రశ్నార్ధకం చేసి, గత్యంతరం లేక ప్రజలు మళ్ళీ భారాస పార్టీకే అధికారం సునాయాసంగా కట్టబెట్టేలా చేస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.
వ్యాసకర్త: శ్రీనివాస్ గుండోజు, పాత్రికేయులు, ఫోన్: 9985188429
Admin
Dhiviti News