దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నిర్వహించే అంగడి (సంత) రాష్ట్రంలోనే అతి పెద్దది. దీని ఆదాయం ఒక్కరోజుకు లక్షల్లో ఉంటుందని అంచనా. కేవలం జిల్లాలోని వ్యాపారులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల నుండి వ్యాపారులు ఈ అంగడికి వచ్చి కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతుంటారు. పశువులు, పాడి గేదెలు, కోళ్లు, ఇతర జంతువులు అమ్మాలన్నా, కొనాలన్నా ఈ అంగడికి రావాల్సిందే. సామాన్యునికి అవసరమయ్యే కూరగాయలు, నిత్యావసర సరుకులు, దుస్తుల నుండి అన్నీ ఈ అంగడిలో సరసమైన ధరలకే దొరుకుతాయని పేరు గాంచడంతో చుట్టు ప్రక్కల పల్లెల నుండి ప్రజానీకం ప్రతి సోమవారం జరిగే కురవి అంగడికి వస్తూంటారు. అలాంటి పేరు, ప్రఖ్యాతులుగాంచిన కురవి అంగడి ఆదాయం ప్రస్తుతం ప్రక్కదారి పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : "ముందు మురిసినోడు పండుగ కానడు" అన్నట్టుగా కాంగ్రెస్ తీరు @DhivitiNews.com
కురవి అంగడికి సంవత్సరానికోసారి మార్చి నెలాఖరులో టెండర్లు నిర్వహించి హక్కుదారులకు అంగడి నిర్వహణ అనుమతులు ఇస్తారు. కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో టెండర్ నిర్వహించినప్పటికీ ప్రభుత్వ బీడ్ ధర (47 లక్షలు) టెండర్ లో పాల్గొన్నవారు పలకకపోవడంతో టెండర్ ను రద్దు చేయడం జరిగిందని దీనితో కురవి గ్రామ పంచాయితీ కార్యదర్శి అయిన తనకే అంగడి నిర్వహణ బాధ్యతలు ఇవ్వడం జరిగిందని కార్యదర్శి తెలిపారు. అయితే, ఈ టెండర్ రద్దయిన కారణాన్ని పై అధికారులకు తెలిపి మరోమారు టెండర్ నిర్వహించాల్సిన బాధ్యత గ్రామ పంచాయితీ పాలకమండలిపైనే ఉండగా, టెండర్ గడువు ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు టెండర్ నిర్వహించకుండా గ్రామ పంచాయితీ కార్యదర్శితోనే అంగడి నిర్వహిస్తుండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి ఊతమిచ్చేలా అంగడిలో జరిగే లావాదేవీలకు సంబంధించి కొని బిల్లులు ఇష్యూ చేయకుండా అంగడి నిర్వాహకులు ఆదాయాన్ని నేరుగా తమ జేబుల్లో వేసుకుంటున్నారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ బిడ్ ధర పలుకక టెండర్ రద్దు చేసినప్పటికీ అనుమతులు పొంది మరోమారు గ్రామ సభ తీర్మానంతో టెండర్ నిర్వహించాల్సిన బాధ్యత గ్రామ పంచాయితీ కార్యదర్శి, పాలకమండలిపై ఉండగా గ్రామ సభలో అంగడి టెండర్ ఎజెండా పెట్టినప్పుడు ఆ విషయాన్ని చర్చకు రానివ్వకుండా పాలకమండలి సభ్యులు గొడవలకు దిగుతూ గ్రామ సభను నిర్వహించకుండా చేస్తున్నట్టు స్వయంగా గ్రామ పంచాయితీ కార్యదర్శే తెలిపారు. అయితే, టెండర్ ఎజెండాగా జరగాల్సిన గ్రామ సభలను అడ్డుకునేందుకే వ్యూహాత్మకంగా గొడవపడేలా కార్యదర్శితో పాటు ముఖ్యులైన ముగ్గురు ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
కురవి సంత ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, దీని ఆదాయంతో కురవి మండల అభివృద్ధి ఎంతో చేయవచ్చునని, టెండర్ లేకుండా సంతను నిర్వహించడం మూలంగా సంత ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతోందని, అంగడి ఆదాయ అక్రమాలకు చెక్ పెట్టాలని సిపిఐ కురవి మండల కార్యదర్శి కరణం రాజన్న అభిప్రాయపడ్డారు. తక్షణమే గ్రామ సభ నిర్వహించి కురవి సంత టెండర్ ను నిర్వహించి ఆ ఆదాయంతో సంతకు కావాల్సిన కనీస వసతులు ఏర్పాటు చేసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన డిమాండ్ చేశారు.
Admin
Dhiviti News