దివిటీ న్యూస్ - ఎడిటోరియల్ / : ప్రైవేట్ (Private), కార్పొరేట్ (Corporate) పాఠశాలల (Schools) యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వారి పాఠశాలలను నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యమైన విద్య (Quality Education) పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతలను క్యాష్ చేసుకుంటూ పలు రకాల రుసుముల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. జీవో నెంబర్ 1 (GO No. 1) నిబంధనల ప్రకారం అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రభుత్వం గుర్తింపు పొందిన పబ్లిషర్లు ముద్రించిన పాఠ్యపుస్తకాలనే వినియోగించాల్సి ఉంటుంది. కానీ ఆలా చేయకుండా ఒక్కో విద్యాసంస్థ తమ సొంత పాఠ్యపుస్తకాలను వినియోగిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల చేత వారి వారి సొంత పాఠ్యపుస్తకాలను కొనుగోలు చూపిస్తూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం.
Also Read : "ముందు మురిసినోడు పండుగ కానడు" అన్నట్టుగా కాంగ్రెస్ తీరు @DhivitiNews.com
ఇక టెక్నో (Techno) ఎడ్యుకేషన్ పేరుతో కార్పొరేట్, ఇతర విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ, టెక్నో పాఠ్యపుస్తకాల అమ్మకంతో తరగతిని బట్టి 6 నుండి 10 వేల రూపాయల పైనే వసూళ్లకు పాల్పడుతున్నట్టు విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. 10వ తరగతి విద్యార్థికి టెక్నో పాఠ్యపుస్తకాల రుసుము గరిష్టంగా 10 వేల పైచిలుకు రూపాయలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. టెక్నో పుస్తకాల రుసుము క్రింద విద్య సంవత్సరం ప్రారంభంలోనే ఆయా విద్యాసంస్థలు తల్లిదండ్రుల వద్ద నుండి రుసుము వసూలు చేస్తున్నప్పటికీ, రుసుము చెల్లించినప్పుడే పాఠ్యపుస్తకాలు అందించకుండా ప్రతి మూడు నెలలకోసారి టెక్నో పాఠ్యపుస్తకాలు ఇస్తూండడంతో తమవద్ద ఒకేసారి ముందస్తుగా పూర్తి సొమ్ము తీసుకున్న విద్యాసంస్థల యాజమాన్యాలు అట్టి రుసుమును సంబంధించిన టెక్నో పుస్తకాలను ఒకే దఫాలో ఇవ్వకుండా దశలవారీగా ఎందుకు ఇస్తున్నట్టు, తాము చెల్లించిన సొమ్ముతో యాజమాన్యాలు వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టా? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
నిబంధలకు విరుద్ధంగా టెక్నో పేరుతో సొంత పాఠ్యపుస్తకాల అమ్మకాలతో ప్రైవేట్ విద్యాసంస్థలు వసూళ్లకు పాల్పడుతున్నప్పటికీ, టెక్నో కరికులం అనుమతులు సైతం లేకుండా కొన్ని విద్యాసంస్థలు యథేచ్ఛగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, విద్యా శాఖ అధికారులు నామమాత్రపు మందలింపులు, నోటీసులతో సరిపెడుతున్నారని, నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆయా విద్యాసంస్థలను సందర్శించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండులు, విద్యార్థి సంఘాల నాయకులూ కోరుతున్నారు.
Admin
Dhiviti News