దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండి అవసరం ఉన్న చోట ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా అధికారులతో, వివిధ మండలాల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Also Read : ప్రైవేట్ స్కూళ్ల "టెక్నో" దోపిడీ..!! @DhivitiNews.com
ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేసేందుకుగాను అధికారులు అవసరం ఉన్న చోట తక్షిణ నివారణ చర్యలను చేపట్టాలని, ప్రతి మండల కేంద్రంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ గ్రామాలలో చెరువుల, కల్వర్టు డ్యాంలపై నీటి ప్రవాహన్ని అడిగి తెలుసుకున్నారు. కల్వర్టు రహదారులపై నీటి ప్రవాహం ఓవర్ ఫ్లో అయినట్లయితే ప్రజలను అప్రమత్తం చేసి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి, దారి మళ్లింపు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అటువైపు వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. పట్టణ, గ్రామ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి అందులో ఎవరైనా ఉంటే వారిని సురక్షితమైన స్థలాలకు చేర్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ముంపు ప్రాంతాల వారిని ఎగువ ప్రాంతానికి చేర్చాలన్నారు. పట్టణ కేంద్రాల్లో, గ్రామాల్లో కాలువల్లో చెత్తాచెదారంతో నిండకుండా ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు ఎక్కడైనా పొరపాటున తెగినట్లయితే స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా హెచ్చరికలు జారీ చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు వర్షాభావ పరిస్థితులతో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం నంబర్ 79950 74803 కు సంప్రదించాలని కోరారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్, జిల్లా అధికారులు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, మునిసిపల్ కమిషనర్లు, విద్యుత్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Dhiviti News