దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : బానోత్ శంకర్ నాయక్ (Banoth Shankar Naik).. ఈ పేరు మానుకోట చరిత్రలో ఎన్నటికీ మరిచిపోలేనిది. వరుసగా రెండుసార్లు మానుకోట (Manukota) భారాస (BRS) అసెంబ్లీ టికెట్ పొంది విజయం సాధించిన ఎమ్మెల్యే (MLA), ఎంతమంది స్వపార్టీ నాయకులు, నాయకురాళ్లు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా, తన అభ్యర్థిత్వంపై వ్యతిరేకత బహిరంగంగానే వెలిబుచ్చినా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తన ప్రయత్నాలు తాను చేసి అధిష్టానం ఆమోదం పొంది ముచ్చటగా మూడోసారి మానుకోట భారాస ఎమ్మెల్యే టికెట్ ను సాధించి హ్యాట్రిక్ కోసం ముందుకు సాగుతున్న సక్సెస్ ఫుల్ రాజకీయనాయకుడు. ఆరోపణలు ఎన్ని వచ్చినా అధిష్టానాన్ని ఎలా ఒప్పించాలో, మెప్పించాలో తెలిసిన వ్యక్తి, అలాగే ప్రత్యర్థిని ఎలా లొంగదీసుకోవాలో, ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో తెలిసిన వ్యక్తి శంకర్ నాయక్.
Also Read : రెడ్ల ‘కోట’లో ‘శంకరు’ని పాగా..!! @DhivitiNews.com
ఆయనపై రాని వివాదం లేదు, ఆయన ప్రవర్తనతో వైరల్ అయినా వీడియోలు కోకొల్లలు, ఆయనకు టికెట్ ఇస్తే ఓడిస్తామని తెగేసి చెప్పిన సొంత పార్టీ నేతలు, ఆయనను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ప్రత్యర్థి పార్టీ నాయకులూ, మామిడి తోటల్లో ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి నిరసనలు తెలిపిన అసమ్మతి నేతలు, కౌన్సిలర్లు ఎందరో.. అయినప్పటికీ ఇవేవి శంకర్ నాయక్ కు టికెట్ రాకుండా అడ్డుకోలేకపోయాయి. గులాభీ దళపతి కేసీఆర్ (KCR) నోటి వెంట కనీసం పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాల్లో మానుకోట ఒకటి అనే మాట సైతం శంకర్ నాయక్ వ్యతిరేక వర్గాలు వినలేకపోయాయి. కారణం.. శంకర్ నాయక్ కు టికెట్ ఎలా సాధించాలో తెలుసు కాబట్టి. ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తే ఎన్నికల్లో గెలుస్తామో స్పష్టంగా తెలుసు కాబట్టి.
మహబూబాబాద్ (Mahabubabad) అసెంబ్లీ నియోజకవర్గం (Assembly Constituency)లో రెండు సార్లు కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలుగా ఏలారు, తెదేపా (TDP) అభ్యర్థులు వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ (Congress) మినహా ఏ ఒక్క పార్టీ సైతం వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఏలిన చరిత్ర మానుకోట అసెంబ్లీ స్థానానికి లేదు. కాగా, భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వరుసగా రెండు సార్లు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి పార్టీ టికెట్ పొంది ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. మూడోసారి సైతం విజయం సాధిస్తే.. మానుకోట గడ్డపై వరుసగా మూడోసారి ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ ఏతర పార్టీ నాయకుడిగా శంకర్ నాయక్ చరిత్రలో నిలిచిపివడం ఖాయం. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ అనుకూల పవనాలు నియోజకవర్గంలో బలంగా వీస్తున్న సమయంలో శంకర్ నాయక్ ఆ రికార్డు ను సొంతం చేసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాల్సిన విషయం.
Admin
Dhiviti News