దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు పార్టీ టికెట్ కేటాయించవద్దని ఆయనను వ్యతిరేకించే పార్టీ లోని అసమ్మతి నేతలు టికెట్ రాకున్నా ముందు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన గ్రామాలలోని మామిడి తోటల్లో రహస్య సమావేశాలు జరిపి మరోమారు సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు పార్టీ టికెట్ ఇస్తే తాము సహకరించమని, శంకర్ నాయక్ కు తప్ప వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా తమకు సమ్మతమేనని తెగేసి చెప్పిన అసమ్మతి నేతల గళం అధిష్టానం పెడచెవిన పెట్టింది. ఎట్టకేలకు వారందరి అభిప్రాయాలను త్రోసిపుచ్చి మరోమారు శంకర్ నాయక్ కె పార్టీ టికెట్ ఇస్తున్నట్టు ఇటీవలే ఆ పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ 115 మంది ఎమ్మెల్యే టికెట్ ల జాబితాలో శంకర్ నాయక్ పేరు సైతం ప్రకటించడం విదితమే. అంతే కాకుండా, తాను ప్రకటించిన జాబితాలోని అభ్యర్థులకు సహకరించకుండా వారికి వ్యతిరేకంగా నడుచుకుంటే వారిపై నిర్దాక్షిణ్యంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించడం గమనార్హం.
అయితే, అభ్యర్థి విషయంలో గులాబీ బాస్ ఇచ్చిన వార్నింగ్ కు లోబడి అసమ్మతి నేతలు ఉంటారని అందరూ భావించినప్పటికీ, మహబూబాబాద్ లోని భారాస అసమ్మతి నేతలు మాత్రం అధినేత వార్నింగ్ ను లెక్కచేసినట్టు కనిపించడం లేదు.. అందుకు భిన్నంగా మరోమారు శుక్రవారం జిల్లా కేంద్ర శివారు ఓ రహస్య ప్రాతంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు సమక్షంలో సమావేశమై ఎమ్మెల్యే శంకర్ నాయక్ అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని అధినేత ప్రకటనను మరోమారు పరిశీలించి శంకర్ నాయక్ స్థానంలో మరో వ్యక్తికి బి ఫార్మ్ ఇవ్వాలని తక్కెళ్లపల్లికి నినదించినట్టు సమాచారం. అందుకు తక్కెళ్లపల్లి సైతం వారి వాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. అధినేత ప్రకటించింది అభ్యర్థి పేరు మాత్రమేనని, బి ఫార్మ్ కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు పార్టీ బి ఫార్మ్ రాకుండా అడ్డుకుంటామని అసమ్మతి నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఏది ఏమైనా కేసీఆర్ అనే వ్యక్తి పార్టీ ఎమ్మెల్యే జాబితా విషయంలో ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించుకున్న దాఖలాలు ఉన్నాయా.. ఒక మనిషి చనిపోయాక బ్రతికొస్తాడని దింపుడుకల్లం వద్ద శవం చెవిలో పిలవడం వల్ల ఏమైనా ఫలితాలున్నాయో లేవో కానీ కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేల జాబితా విషయంలో తీసుకున్న నిర్ణయంలో మార్పు కావాలని ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అధినేత ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో వ్యతిరేకత ఉంటె పార్టీ మారిపోవడంమో.. లేదా ప్రకటించిన అభ్యర్ధికి సహకరిస్తూ.. పార్టీలో కొనసాగడమో.. అనే రెండు అంశాలే పరిగణలో ఉంటాయనేది గులాబీ బాస్ పార్టీని నడిపే తీరును చుసిన ఎవ్వరైనా చెప్పే మాట. మరి ఎమ్మెల్యే శంకర్ నాయక్ టికెట్ అంశంపై అసమ్మతి నేతల గళం మారుతుందో.. లేదా ఆ గళం మార్చుకోకుండా పార్టీని వీడే ధైర్యం చేస్తారో వేచి చూడాలి.
Admin
Dhiviti News