దివిటీ న్యూస్ - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారంతో 54 ఏళ్ళు నిండి 55వ ఏటకు అడుగిడబోతోంది. మంగళవారం ఆమె 55 జమ్నాదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలను ఓసారి తెలుసుకుందాం.
Also Read : శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు @DhivitiNews.com
సత్యవతి రాథోడ్ 1969 అక్టోబర్ 31న మహబూబాబాద్ జిల్లా (నాటి వరంగల్ జిల్లా) కురవి మండలం పెద్ద తండాకు చెందిన ఓ సామాన్య గిరిజన (లంబాడా) రైతు కుటుంబం లింగ్యా నాయక్, దస్మి దంపతులకు జన్మించారు. ఆరోజుల్లో ఎంత అగ్రవర్ణ కులానికి చెందిన మహిళలైనా సమాజంలో వివక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉండేవి, అలాంటిది ఒక గిరిజన లంబాడి కులానికి చెందిన మహిళ అయిఉండి కూడా ఆమె నాయకత్వ పటిమతో రాజకీయరంగంలో ప్రవేశించి నాయకురాలిగా పురుష నాయకులతో సమఉజ్జీగా పోటీ పడుతూ సవాళ్ళను స్వీకరిస్తూ, విజయాలను సాధిస్తూ ఎమ్మెల్యేగా.. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరు గిరిజన స్త్రీలకే కాదు మొత్తం స్త్రీ జాతికే ఆదర్శంగా నిలిచిందనడంలో అతిశయోక్తి లేదు. ఎనిమిదవ తరగతి చదివి విద్యాభ్యాసం అర్ధాంతరంగా ముగించిన సత్యవతి ఆతరువాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1982, మే 5న గోవింద్ రాథోడ్ అనే వ్యక్తిని పెళ్లాడిన సత్యవతికి ఇద్దరు అబ్బాయిలు.. కాగా అనతికాలంలోనే భర్త రోడ్ ప్రమాదంలో మరణించారు. అయినప్పటికీ సత్యవతి రాథోడ్ తన వైవాహిక జీవితం, వ్యక్తిగత జీవితాలలో ఎదురైనా ఒడిదొడుకులు వెరవక రాజకీయరంగంలో నాయకురాలిగా దూసుకుపోయారు. 1984లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1988-1991 వరకు పంచాయతీ రాజ్ పరిషత్ సభ్యురాలిగా పనిచేసి, 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్గా పనిచేశారు. 1989లో డోర్నకల్ నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సత్యవతి రాథోడ్ బరిలో నిలిచి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్ రెడ్యా నాయక్ పై ఓటమి చెందినప్పటికీ.. ఓటమికి కృంగిపోకుండా రాజకీయాల్లొ కొనసాగుతూ 2007లో నర్సింహులపేట జడ్పిటిసి పీఠాన్ని దక్కించుకొని జడ్పిటిసిగా పనిచేసి, 2009 ఎన్నికల్లో మళ్ళీ డోర్నకల్ నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచి.. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్ రెడ్యా నాయక్ పై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు సత్యవతి రాథోడ్. అనంతరం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న సత్యవతి రాథోడ్ను తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకొని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలకు ఆమెను మంత్రిగా నియమించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా మహబూబాబాద్ ఇంచార్జ్ మంత్రిగా ఆమె ప్రస్థానంలో జిల్లాకు పలు గిరిజన గురుకుల పాఠశాలల మంజూరితోపాటు, పలు విద్యా సంస్థలను, ప్రాజెక్ట్ లను, చెక్ డ్యామ్ లు, ముఖ్యమైన రోడ్ ల మంజూరిలో మంత్రి సత్యవతి కీలకంగా వ్యవహరించి కోట్ల రూపాయల నిధులను జిల్లాకు తెచ్చి, జిల్లాను అభివృద్ధిపథంలో నడిపించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇదీ క్లుప్తంగా మంత్రి సత్యవతి రాథోడ్ జీవిత విశేషాలకు సంబంధించిన సమాచారం. ఒక గిరిజన మహిళగా తన జీవితం కేవలం ఒంటింటికే పరిమితం కాకుండా రాజకీయ రంగంలోకి ప్రవేశించి పురుష నాయకులకు ధీటుగా ఎదిగి స్త్రీలు సైతం రాజకీయాల్లో ఎదిగి ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని నిరూపించి కేవలం గిరిజన స్త్రీలకే కాకుండా, మొత్తం స్త్రీ జాతికి ఆదర్శంగా ఆమె రాజకీయ జీవితం నిలుస్తోందని చెప్పవచ్చు. ఈ అక్టోబర్ 31కి 54 ఏళ్ళు పూర్తి చేసుకొని 55 ఏట అడుగిడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్ కు "దివిటీ న్యూస్" వెబ్సైటు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మునుముందు ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తోంది.
- వ్యాసం శ్రీనివాస్ గుండోజు, జర్నలిస్ట్ (ఫోన్: 9985188429)
Admin
Dhiviti News