దివిటీ న్యూస్ - తెలంగాణ / సూర్యాపేట : చెవిటి వెంకన్న యాదవ్ ప్రస్తుత సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ లో వార్డు మెంబర్ స్థాయి నుండి జిల్లా పార్టీ అధ్యక్షుడి వరకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అంతా కాంగ్రెస్ పార్టీ లోనే సాగింది. ఆయనది సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవల్లి గ్రామం. ఆయన రాంరెడ్డి దామోదర్ రెడ్డి అనుచరుడిగా గ్రామ వార్డు మెంబర్ గా, తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, ప్రస్తుతం రెండవసారి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వివిధ పదవుల్లో పార్టీకి ప్రజలకి సేవలందించారు.
Also Read : 111 జీవో రద్దు ఎవరికి లాభం?? @DhivitiNews.com
ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే రాజకీయంగా కాస్త రెడ్డి సామాజికవర్గానిదే పైచేయిగా కొనసాగుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న బీసీ నాయకులంతా అధిష్టానం మీద గంపెడు అంత ఆశలతో ఉన్నారు. ఒక వైపు బిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బడుగుల లింగయ్య యాదవ్ కి రాజ్యసభ, బొల్లం మల్లయ్య యాదవ్ కి ఎమ్మెల్యేగా, దుదిమెట్ల బాలరాజు యాదవ్ కి కార్పొరేషన్ ఛైర్మెన్ గా అవకాశం కల్పించి చాకచక్యంగా జిల్లా లోని యాదవ సామాజికవర్గం మొత్తం తమ వైపు చూసేలా పావులు కదిపింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశించినంత స్థాయిలో జిల్లాలో బీసీలకు ముఖ్యంగా యాదవులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని కొంత ఆ సామాజికవర్గంలో అసంతృప్తి నెలకొని ఉంది. వచ్చే ఎన్నికల్లో చెవిటి వెంకన్న యాదవ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నట్టు అందులో బాగంగా భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి బరిలో దిగాలని ఆయన సన్నిహితులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్టు సమాచారం.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువ శాతం ఉండటం, అందులోనూ చెవిటి వెంకన్న యాదవ్ బీసీ నాయకుడు కావడం, ఆయన బీసీలతో మంచి సంబంధాలు కలిగి ఉండటంతో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆయనకి అవకాశం ఇస్తే తప్పకుండా దానివళ్ళ పార్టీ కి కలిసొచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ తనకి అవకాశం ఇస్తే పార్టీలకి అతీతంగా ఉమ్మడి జిల్లాలోని బీసీ నాయకుల మద్దతు తనకి లభిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారట. నల్గొండ జిల్లాలో ఇటీవలే జరిగిన ఒక సమావేశంలో జానా రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిల ముందే మాజీ పిసిసి అధ్యక్షుడు విహెచ్ జిల్లాలో కనీసం రెండు సీట్లు అయినా ఈసారి బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించారని సమాచారం. ఒకవేళ అవకాశం ఇస్తే బీసీ ఓటు బ్యాంక్ ను కాంగ్రెస్ పార్టీ వైపు మల్లించవచ్చు అనే అభిప్రాయంలో చెవిటి వెంకన్న ఉన్నారట. రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులతో తప్పకుండా వచ్చే ఎన్నికల బరిలో నిలవాలని ఆయన అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో జిల్లాలోని బీసీ ఓట్లను తన వైపు తిప్పుకుంటుంధో సమీప భవిష్యత్ లో తేలనుంది.
Admin
Dhiviti News