దివిటీ న్యూస్ - తెలంగాణ / సూర్యాపేట : సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ తెలంగాణాలో సైతం విస్తరించే పనిలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలలో పట్టును సాధించాలని జనసేనాని ఆలోచిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈమేరకు సూర్యాపేట జిల్లా కోదాడ అసెంబ్లీ నుండి తొలి అడుగు వేయాలని యోచిస్తున్నారట. గతంలో నల్గొండ పార్లమెంట్ కి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ మేకల సతీష్ రెడ్డిని ఈ సారి జనసేన తరుపున కోదాడ బరిలో నిలపాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సతీష్ రెడ్డి సైతం నియోజకవర్గంలో పార్టీ కేడర్ ని సమాయత్తం చేస్తూ స్థానిక ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూనే, స్థానిక ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలు చేస్తూ నియోజకవర్గంలో తన పట్టును కొనసాగిస్తున్నారు. దీనితో గత కొంతకాలంగా కోదాడలో రాజకీయ హీట్ పెరిగింది.
Also Read : "యాదవ్" మదిలో ఆ పార్లమెంట్ స్థానం..!!@DhivitiNews.com
మేకల సతీష్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి గ్రామంకు చెందినవాడు. ఉన్నత విద్యావంతుడైన సతీష్ రెడ్డి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నప్పటికీ, స్వదేశానికి సేవ చేయాలని, మరీ ముఖ్యంగా కోదాడ నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం రాజకీయ వేదికను ఎంచుకొని ప్రజాసేవకు అంకితమవ్వాలనే బలమైన సంకల్పంతో జనసేన పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాలలో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో సహజంగానే జనసేన పార్టీలో చేరి గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం బరిలో నిలిచి ఓడిపోయారు. అప్పటినుండి ఆయన పలు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వస్తున్నారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్ బలంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సతీష్ రెడ్డి జనాసేన పార్టీని బలోపేతం చేస్తూ పని చేస్తున్నారు సతీష్ రెడ్డి. పార్టీలో ఆయన రాష్ట్ర స్థాయిలో సైతం బలమైన నేతగా ఎదిగారు. అయితే ఈ సారి ఆయన కోదాడ బరిలో నిలిచే యోచనలో ఉన్నట్లు ఆయన అనుచరులు తెలుపుతున్నారు. కోదాడ ఆంధ్ర సరిహద్దులో ఉండటంతో పవన్ కళ్యాణ్ చరిష్మా అక్కడ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అవసరమైతే పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరోలను సైతం ప్రచారానికి తీసుకురావాలని సతీష్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం. కోదాడలో కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, బిఆర్ఎస్ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే బీజేపీ, జనసెన పొత్తులో ఉండటంతో జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్ధిగా తానే బరిలో నిలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జయాపజయాలను ప్రస్తుతం అంచనా వేయడం సరైనది కానప్పటికీ.. కాంగ్రెస్, బిఆర్ఎస్ లను తట్టుకొని పోటీలో నిలిచి కోదాడలో జనసేనాని జెండా ఎగరేస్తాడా? లేదా? అనేది సమీప భవిష్యత్ లో తేలనుంది.
Admin
Dhiviti News