దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఎస్.వి.వి. హై స్కూల్ (శ్రీ వివేకానంద విద్యాలయం) వారు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ విద్యా సంవత్సరంకుగాను "శ్రీ చైతన్య టెక్నో కరికులం" హోర్డింగులు ఏర్పాటు చేసి, ప్రచార బ్రోచర్లు విడుదల చేసి అమాయకులైన విద్యార్థుల తల్లిదండ్రుల నుండి టెక్నో కరికులం ఫీజులతో అడ్మిషన్లు స్వీకరించడం జరిగింది. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆ పాఠశాల ముందు ధర్నాలు చేసి, విషయాన్ని మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయగా, స్పందించిన మండల విద్యాధికారి శ్రీదేవి ఎస్.వి.వి. హై స్కూల్ యాజమాన్యానికి మొట్టికాయలు వేస్తూ మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read : ఎన్నికల సీజన్ వ్యాపారులతో కాంగ్రెస్ కు నష్టం - వ్యాసం @DhivitiNews.com
అయితే, టెక్నో కరికులం అనుమతులు లేనందున ఈ పాఠశాలలో సాధారణ విద్యాబోధనలే చేయాల్సి ఉండగా, ఇప్పటికే టెక్నో కరికులం పేరిట అధిక ఫీజులతో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు సాధారణ విద్యకు సంబంధించిన ఫీజులే వర్తింపజేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి వెలుగు శ్రవణ్ డిమాండ్ చేశారు.
ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా.. ఎంఈఓ నోటీసులు ఇచ్చిన తరువాత టెక్నో కరికులం పేరిట అడ్మిషన్లు తీసుకోవడం లేదని, ప్రచార హోర్డింగులు సైతం తొలగించామని తెలిపారు. కానీ ఇప్పటికే టెక్నో కరికులం పేరిట స్వీకరించిన అడ్మిషన్లకు సాధారణ ఫీజును వర్తింపజేస్తారా? అని అడిగిన ప్రశ్నకు దాటవేత సమాధానం చెప్పారు. ఈ విషయమై విద్యాధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
Admin
Dhiviti News